ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు క్లీన్ చిట్
హైదరాబాద్/జగిత్యాల:
పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు ఊరట లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ మారారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 4న విచారణ జరిపిన స్పీకర్, సంజయ్‌కుమార్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో ఫిరాయింపుల కేసులో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయ్యింది.
ఇప్పటికే అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలెయాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా సంజయ్‌కుమార్ కూడా ఆ జాబితాలో చేరారు. కాగా, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది.
‘నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే’
అనర్హత పిటిషన్ కొట్టివేత అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచే గెలిచిన ఎమ్మెల్యేనిగా తన జీతం నుంచి నెలకు రూ.5,000 పార్టీకి చెల్లిస్తున్నానని తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు, పార్టీ విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని చెప్పారు.
ఇప్పటి వరకు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీని గానీ, పార్టీ అధిష్టానాన్ని గానీ విమర్శించలేదన్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం తనకు దూరంగా ఉంటోందని, తన పోరాటం ఎన్నికల కోసం కాదని, జగిత్యాల అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు.
‘అభివృద్ధికే ప్రాధాన్యం’
జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు సంజయ్‌కుమార్ తెలిపారు. తనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా, ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నానన్నారు. జగిత్యాల అభివృద్ధికి మద్దతు ఇచ్చే అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని ప్రజలను కోరారు.
జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని, ప్రజల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.
