రాజమండ్రి–కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. జబర్దస్త్ కమెడియన్ బాబీ మృతి
రాజమండ్రి–కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ లక్ష్మీనారాయణ అలియాస్ బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం సోమవారం (ఫిబ్రవరి 2, 2026) రాత్రి చోటుచేసుకోగా.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ విశ్వం తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరుకు చెందిన అక్షయ్ కుమార్, సత్యకుమార్ సహా ముగ్గురు యువకులు ఒకే ద్విచక్ర వాహనంపై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. అదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన జబర్దస్త్ కమెడియన్ బాబీ తన మోటార్‌సైకిల్‌పై ఎదురుగా వస్తుండగా రెండు వాహనాలు బ్రిడ్జిపై బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బాబీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. మరో బైక్‌పై ప్రయాణిస్తున్న అక్షయ్ కుమార్, సత్యకుమార్ కూడా తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. దీంతో ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
టెలివిజన్ రంగానికి తీరని లోటు
జబర్దస్త్ కమెడియన్ బాబీ తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించారు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, యాంకర్ సుమ నిర్వహించే ‘సుమ అడ్డా’ వంటి పాపులర్ షోల ద్వారా ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ.. తన నటనతో ఇతరులను నవ్వించే బాబీ ఇలా అకాల మరణం చెందడం టెలివిజన్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రమాద వార్త తెలియగానే పలువురు జబర్దస్త్ కమెడియన్లు, సహనటులు సోషల్ మీడియా వేదికగా ‘మిస్ యూ బాబీ’ అంటూ పోస్టులు పెడుతూ సంతాపం తెలిపారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్న యాంకర్ సుమ బాబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే బాబీని విగతజీవిగా చూసి ఆమె కంటతడి పెట్టారు. అనంతరం బాబీ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కొన్ని రోజుల క్రితమే ఇంటర్వ్యూ
ప్రమాదానికి కొద్ది రోజుల ముందే బాబీ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొనడం విశేషం. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో టెలివిజన్ రంగం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
నవ్వులు పంచిన బాబీకి ఇలా విషాదాంతం రావడం అభిమానులు, సహచరులను తీవ్రంగా కలచివేస్తోంది.
