సుప్రీంకోర్టులో లాయర్‌గా మమతా బెనర్జీ.. స్వయంగా వాదనలు వినిపించి చరిత్ర సృష్టించిన సీఎం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం (ఫిబ్రవరి 4) అరుదైన, ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా నల్ల కోటు ధరించి సుప్రీంకోర్టు ముందు హాజరై వాదనలు వినిపించారు. ఓ కేసులో పార్టీ తరఫున కాదు.. తన స్వంత న్యాయవాదిగా కోర్టులో నిలిచి వాదించడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు.
అసలు కేసు ఏంటంటే..?
వెస్ట్ బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, దీని వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగగా, మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు.
సర్ ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధత లోపించిందని మమతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియను వ్యక్తులు, రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకునే ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రాబోయే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేలా సర్‌ను అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్ పేరుతో దొంగ ఓట్లను తొలగించడం కాకుండా, కొన్ని ప్రాంతాల్లో కొత్తగా దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
టీఎంసీకి బలంగా ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓటర్లను తొలగిస్తున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ అంశంపై తాను ఎన్నికల కమిషన్‌కు ఆరు లేఖలు రాసినప్పటికీ ఒక్క దానికి కూడా స్పందన రాలేదని తెలిపారు. సర్ ప్రక్రియ వల్ల ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని అన్నారు. ఈ పోరాటం తన పార్టీ కోసం మాత్రమే కాదని, దేశ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం సాగుతున్న యుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. “బెంగాల్లో న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది” అంటూ చేసిన వ్యాఖ్యలు కోర్టు ప్రాంగణంలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
మమతా బెనర్జీ వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. బెంగాల్లో అమలు చేస్తున్న సర్ ప్రక్రియపై పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది.
మమతా బెనర్జీకి న్యాయశాస్త్ర అర్హత
మమతా బెనర్జీ కోల్‌కతాలోని జోగేశ్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయవాదిగా వాదించే అర్హత ఆమెకు ఉంది. ఈ నేపథ్యంలోనే తన పిటిషన్‌ను స్వయంగా వాదించేందుకు ఆమె సుప్రీంకోర్టు అనుమతి కోరగా, కోర్టు అనుమతించింది. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి స్వయంగా నల్లకోటు ధరించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
