ఫోన్ ట్యాపింగ్ కేసులో డైవర్షన్ గేమ్.. సీఎం రేవంత్‌ను ఎవరో నడిపిస్తున్నారు: కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా విచారణలు నిర్వహిస్తున్న తీరుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ విచారణ అనేది ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న గేమ్ మాత్రమే. అసలు అంశాల నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామా కొనసాగుతోంది. వరుసగా విచారణలు అంటూ హడావుడి చేస్తుంటే ఇందులో ఏదో ఉందనే అనుమానం సహజంగానే కలుగుతోంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందని గుర్తుచేశారు. ‘‘దివాలా తీసిన ఒక సంస్థకు ఏకంగా రూ.6 వేల కోట్ల టెండర్లు ఎలా ఇచ్చారు? ఇందులో భారీ అవకతవకలు ఉన్నాయనే విషయం ఇప్పుడు బయటపడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది’’ అని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సీఎం కాదని, ఆయనను ఎవరో నడిపిస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ సీఎం కాదు.. ఆయన్ను వెనుక నుంచి ఒక శక్తి నడిపిస్తోంది. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఆరోపణలు, విచారణల పేరుతో కాలం వృథా చేస్తోంది’’ అని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్‌పై దాడులు చేసి రాజకీయ లాభాలు పొందాలనే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. అయితే ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు బయటకు రావాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని, రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడితే బీఆర్‌ఎస్ మౌనంగా ఉండదని స్పష్టం చేశారు.
