రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య.. ఆస్థి కోసం సొంత అన్న చేతిలో లాయర్ స్వప్న హత్య
రంగారెడ్డి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లాయర్ స్వప్నను ఆమె సొంత అన్నే సుపారీ ఇచ్చి హత్య చేయించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆస్థి వివాదమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. గత మూడేళ్లుగా అన్న–చెల్లెలు మధ్య ఆస్తి విషయంలో తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్వప్న తనను ఇబ్బంది పెడుతోందన్న నెపంతో ఆమెను హత్య చేయాలని అన్న కుట్ర పన్నినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బుధవారం ఉదయం స్వప్న తన తల్లి వెంకటమ్మతో కలిసి సర్వే పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. పని ముగించుకుని తిరిగి వస్తుండగా.. ముఖాలకు ముసుగులు ధరించిన సుపారీ గ్యాంగ్ కారులో అక్కడికి చేరుకుంది. ఏమి జరుగుతుందో అర్థం కాకముందే స్వప్నపై దుండగులు కర్రలతో దాడి చేసి నేలకూల్చి, అనంతరం కత్తితో మెడపై దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తల్లి వెంకటమ్మ తీవ్రంగా వేదన వ్యక్తం చేశారు. గతంలో తన కూతురిని రెండుసార్లు యాక్సిడెంట్ రూపంలో చంపే ప్రయత్నం జరిగిందని, ఆ రెండు సందర్భాల్లో స్వప్న అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిందని తెలిపారు. ఈసారి మాత్రం సుపారీ గ్యాంగ్ ద్వారా హత్య చేయించారని ఆమె ఆరోపించారు.
స్వప్న గతంలో తన అన్నపై పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు స్వప్న ప్రాణాలు కోల్పోయేది కాదని న్యాయవాదులు అంటున్నారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. స్వప్న హత్యకు కారణమైన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ హత్యకు కారణమని వారు ఆరోపించారు.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యలో సుపారీ గ్యాంగ్ పాత్ర, వెనుక ఉన్న కుట్ర కోణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడైన స్వప్న అన్నపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. సొంత అన్నే చెల్లెలి ప్రాణాలు తీసిన ఘటన స్థానికులను కలచివేసింది.
