తెలంగాణకు ‘గాడిద గుడ్డే’ తీసుకొచ్చారు: బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
కరీంనగర్, ఫిబ్రవరి 5:
బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు తప్ప ఏమీ తేలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా రుక్మాపూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన సీఎం, జిల్లాలో ఏటీసీ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చొప్పదండి సెగ్మెంట్ గుమ్లాపూర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం బీఆర్‌ఎస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
బీజేపీ నేతలు ఎంత మంది తెలంగాణకు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేరని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్-బీజేపీ బంధం ‘వీణా–వాణి’ లాంటిదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ ఓట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ఆరోపించారు.
కరీంనగర్ నుంచే తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేసిన సీఎం, ఇదే గడ్డపై సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర హామీ ఇచ్చారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టం వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని సోనియా గాంధీని కొనియాడారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను సోనియానే సాకారం చేశారని అన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే రైతులకు ఉచిత కరెంట్ వచ్చిందని, ఉచిత కరెంట్ పథకం పేటెంట్ కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చితే బీఆర్‌ఎస్ నేతలు తమ కుటుంబ ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనను చూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో చొప్పదండిలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
