మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. కో-ఆర్డినేటర్ల నియామకం
హైదరాబాద్:
మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కో-ఆర్డినేటర్లను నియమిస్తూ టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కో-ఆర్డినేటర్లను నియమించింది.
ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన పీసీసీ, నిజామాబాద్ కార్పొరేషన్‌కు నలుగురు, కొత్తగూడెం కార్పొరేషన్‌కు ముగ్గురు కో-ఆర్డినేటర్లను నియమించింది. ఈ రెండు కార్పొరేషన్లను వ్యూహాత్మకంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పీసీసీ ముందుకెళ్తోంది.
ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 15 నియోజకవర్గాల్లో 14 చోట్ల మంత్రులకు బాధ్యతలు అప్పగించగా, ఆదిలాబాద్ నియోజకవర్గ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి సీఎం అప్పగించారు.
మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆధిక్యం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.
క్షేత్రస్థాయిలో నేతలతో సమన్వయం పెంచుకొని ఎన్నికల నిర్వహణను పటిష్టం చేయడానికే కో-ఆర్డినేటర్ల నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
