తెలంగాణపై గత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాకే ఇక్కడ అడుగు పెట్టాలి: పవన్ కళ్యాణ్‌కు టీపీసీసీ చీఫ్ అల్టిమేటం
హైదరాబాద్:
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ముందుగా వివరణ ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలని అల్టిమేటం జారీ చేశారు.
సినీ నటుడిగా పవన్ కళ్యాణ్, చిరంజీవిలకు తాను అభిమానినేనని పేర్కొన్న మహేశ్ కుమార్ గౌడ్, రాజకీయంగా మాత్రం పవన్ కళ్యాణ్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చెబితే ఇక్కడ ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు.
బీజేపీకి ఓటు బ్యాంకు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ కాళ్లపై మోకరిల్లాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే దిక్కు దివానా లేదని, అలాంటప్పుడు తెలంగాణ వ్యతిరేకిగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రచారంతో బీజేపీకి లాభం ఎలా వస్తుందని నిలదీశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నట్లు జనసేన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ–జనసేన అభ్యర్థుల గెలుపు కోసం త్వరలో రూట్ మ్యాప్ ఖరారు కానుందని ఆ పార్టీ వెల్లడించింది.
ఓటు బ్యాంకు లేకే బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్: మహేశ్ కుమార్ గౌడ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలకు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఓటు బ్యాంకు లేకపోవడమే బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు కారణమని విమర్శించారు. గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణకు ఎంపీల ద్వారా ఏం చేసిందని ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీకి ఎందుకు ఇంత వివక్ష అని నిలదీశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని విమర్శించారు. ఎన్నికలు రాగానే కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లు గెలుచుకుంటుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
