రూ.25 కోట్లు అడిగినట్టు వార్తల్లో నిజం లేదు: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ
జూబ్లీహిల్స్ :
ఏపీకి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తాను రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బాధితురాలు వీణ స్పష్టం చేశారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నం.2లో మీడియాతో మాట్లాడిన ఆమె, తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం ఆయన ఇంట్లో కూడా అందరికీ తెలుసని వీణ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిసారీ కూడా అరవ శ్రీధర్ తనకు వీడియో కాల్ చేసేవారని చెప్పారు. తనతోనే కాకుండా మరో ఐదుగురు మహిళలతో కూడా ఆయన సంబంధం కొనసాగించాడని ఆరోపించారు.
ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను సేకరించి భద్రపరచుకున్నానని వీణ వెల్లడించారు. తనకు న్యాయం కావాలనే ఉద్దేశంతోనే ఎన్‌హెచ్‌ఆర్‌సీ (జాతీయ మానవ హక్కుల కమిషన్) సపోర్టుతో ఆయనపై కేసు నమోదైందని తెలిపారు.
అఫిడవిట్‌లో ఆదాయం రూ.3 లక్షలే.. రూ.25 కోట్లు ఎలా అడుగుతాం?: న్యాయవాది
ఈ సందర్భంగా వీణ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన అఫిడవిట్‌లో వార్షిక ఆదాయం కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని చూపించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని రూ.25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తామని ప్రశ్నించారు. అంటే ఆయన వద్ద బ్లాక్ మనీ ఉందా అని కూడా నిలదీశారు.
అలాగే ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడిన అంశంపై స్పీకర్ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
