గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊరట
సింగిల్ జడ్జి తీర్పు రద్దు… 562 ఉద్యోగాలకు లైన్ క్లియర్
తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగుల భవితవ్యం ఎట్టకేలకు తేలింది. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ (ఫిబ్రవరి 5) రద్దు చేయడంతో, ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 562 మంది అభ్యర్థులకు భారీ ఊరట లభించింది.
గ్రూప్-1 పరీక్షలు సక్రమంగానే జరిగాయని, పరీక్షల నిర్వహణ లేదా మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని నిరూపించే ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గ్రూప్-1 ఉద్యోగాలపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది.
కేసు నేపథ్యం ఇదే…
563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్, జూన్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, 2025 మార్చి 30న ఫలితాలను ప్రకటించింది. అనంతరం ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది.
అయితే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుమారు 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు 2025 ఏప్రిల్ 17న గ్రూప్-1 నియామక ప్రక్రియను నిలిపివేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించవచ్చని అనుమతి ఇచ్చింది.
అయినా డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో 2025 సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 562 మంది గ్రూప్-1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించి నియామకాలపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే 2025 అక్టోబర్ 7న జస్టిస్ సూర్యకాంత్, జోయమాల్య బాగ్జిల ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించాలని సూచిస్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు.
అనంతరం గ్రూప్-1 నియామకాలను రద్దు చేయొద్దంటూ ఉద్యోగ నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు, టీజీపీఎస్సీ, ప్రభుత్వం కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 అక్టోబర్ 15న వాదనలు విన్న హైకోర్టు, తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేస్తూ కేసును 2026 ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
తుది తీర్పు
ఇవాళ (ఫిబ్రవరి 5) తుది తీర్పును వెల్లడించిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. గ్రూప్-1 పరీక్షలు నిబంధనల ప్రకారమే జరిగాయని, అవకతవకలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. దీంతో 562 మంది గ్రూప్-1 ఉద్యోగులకు పూర్తి స్థాయి ఊరట లభించింది.
