మహిళల ఆర్థిక సాధికారతకు తెలంగాణ పోలీస్ వినూత్న అడుగు
500 మంది మహిళలతో ‘మహిళా ఎలక్ట్రిక్ ఆటో’ పైలట్ ప్రాజెక్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతతో పాటు రవాణా రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలను ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దడంతో పాటు వారికి ఎలక్ట్రిక్ ఆటోలను అందించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ డీలర్షిప్ సంస్థ ‘వీవీసీ మోటార్స్’తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.
బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ చారుసిన్హా నేతృత్వంలో వీవీసీ మోటార్స్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఎంఓయూ ద్వారా మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సంస్థకు అధికారిక భాగస్వామిగా ఉన్న వీవీసీ మోటార్స్ సహకారంతో నగరంలో ‘మహిళా ఆధారిత ఎలక్ట్రిక్ మొబిలిటీ’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
500 మంది మహిళల ఎంపిక
ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500 మంది మహిళలను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్‌పై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు కనీసం ఏడాది పాటు ఉపాధి లభించడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో వారి ఉనికి పెరగడం వల్ల మహిళలకు మరింత సురక్షితమైన ప్రయాణ వాతావరణం ఏర్పడుతుందని అడిషనల్ డీజీ చారుసిన్హా తెలిపారు.
ఈ ఒప్పందం కింద క్షేత్రస్థాయిలో మహిళా డ్రైవర్లను సమీకరించడం, ఎంపికైన మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను అందించడం వంటి బాధ్యతలను వీవీసీ మోటార్స్ సంస్థ నిర్వహించనుందని ఆమె వెల్లడించారు. మహిళల భద్రత, ఉపాధి, స్వయం ఆధారిత జీవనం లక్ష్యంగా తీసుకున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో కొత్త మార్గదర్శకంగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.
