ప్రైవేట్ ట్యాక్సీలకు గట్టి పోటీగా ‘భారత్ టాక్సీ’
సున్నా కమీషన్, తక్కువ చార్జీలు… అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం
న్యూఢిల్లీ: మన రోజువారీ ప్రయాణాల్లో ట్యాక్సీ సర్వీసులు కీలక భాగంగా మారిన వేళ, ప్రయాణికులపై భారం తగ్గించడంతో పాటు డ్రైవర్ల ఆదాయాన్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం సొంతంగా ‘భారత్ ట్యాక్సీ’ని తీసుకొచ్చింది. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం ఈ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది సహకార విధానంలో ప్రయాణ సేవలు అందించే దేశంలోనే తొలి ప్లాట్‌ఫారమ్‌గా నిలవనుంది.
రెండు నెలల పాటు ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సేవలు విజయవంతం కావడంతో, ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. త్వరలోనే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాల్లో కూడా భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి.
డ్రైవర్లే వాటాదారులు
భారత్ ట్యాక్సీ ప్రత్యేకత ఏమిటంటే… ఇందులో డ్రైవర్లు కేవలం సేవలు అందించే కార్మికులు మాత్రమే కాదు. ఈ సంస్థలో వారే వాటాదారులు. అందుకే డ్రైవర్లను ‘సారథులు’గా పిలుస్తారు. అమూల్ తరహాలో సహకార విధానంలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మల్టీ-స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్ చట్టం–2002 కింద ఈ సంస్థను నమోదు చేశారు.
సున్నా కమీషన్… తక్కువ చార్జీలు
ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ట్యాక్సీ యాప్‌లు డ్రైవర్ల ఆదాయం నుంచి 20 నుంచి 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్న పరిస్థితుల్లో, భారత్ ట్యాక్సీ సున్నా కమీషన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని వల్ల డ్రైవర్లకు పూర్తి ఆదాయం దక్కనుంది.
అలాగే వర్షం, పీక్ అవర్స్ సమయంలో ప్రైవేట్ యాప్‌లు ధరలను పెంచే విధానం ఇక్కడ ఉండదు. భారత్ ట్యాక్సీలో చార్జీలు పూర్తిగా స్థిరంగా ఉంటాయి.
- తొలి 4 కిలోమీటర్ల వరకు కనీస చార్జీ: రూ.30
- 4 నుంచి 12 కిలోమీటర్ల వరకు: కిలోమీటరుకు రూ.23
- 12 కిలోమీటర్ల పైగా: కిలోమీటరుకు రూ.18
ప్రైవేట్ ట్యాక్సీలతో పోలిస్తే ఇవి సుమారు 20 నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉండనున్నాయి.
ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ
భారత్ ట్యాక్సీ ప్రారంభంతో ప్రైవేట్ ట్యాక్సీ సంస్థలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటికే సుమారు 3 లక్షల మంది డ్రైవర్లు ఈ వేదికలో చేరారు. ప్రైవేట్ యాప్‌లలో కమీషన్ కోతలు, అధిక ధరల కారణంగా డ్రైవర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ ఆకర్షణగా మారుతోంది.
భారత్ ట్యాక్సీలో డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఇది గట్టి సవాలుగా మారనుందని, కమీషన్లు తగ్గించాల్సిన పరిస్థితి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
