ఆడియో ఫంక్షన్‌లో వివాదాస్పద పాట…
నటుడు చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
హైదరాబాద్: బరాబర్ ప్రేమిస్తా.. సినిమా ఆడియో ఫంక్షన్‌లో నటుడు చంద్రహాస్ పాడిన పాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్టేజ్‌పై బూతు పదాలు ఉన్న పాటను పాడి అవమానించారంటూ చేసిన ఫిర్యాదు మేరకు చంద్రహాస్‌పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బుధవారం (ఫిబ్రవరి 4) నిర్వహించిన బరాబర్ ప్రేమిస్తా.. సినిమా ఆడియో ఫంక్షన్ గందరగోళంగా మారింది. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్ పాడిన “గుంజీ గుంజీ…” పాటలో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయని పలువురు తీవ్రంగా విమర్శించారు. స్టేజ్‌పైనే ఈ పాటను పాడడం అనుచితమని, ఇది ప్రేక్షకులను అవమానించే విధంగా ఉందని ఆరోపించారు.
పాటపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలని కోరగా, చంద్రహాస్ స్పందించిన తీరు మరింత వివాదానికి దారితీసింది. అతిథులు, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేయగా, ముఖ్య అతిథిగా హాజరైన నటుడు జేడీ చక్రవర్తి కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై ప్రముఖ టీవీ ఎడిటర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడియో ఫంక్షన్‌లో బూతు పాటలు పాడి ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
