కాంగ్రెస్కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లానే తీసేస్తారు: మున్సిపల్ ప్రచారంలో కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 05:
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం సిరిసిల్ల పట్టణం బివైనగర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లానే తీసేస్తారని ఆయన ఆరోపించారు. ఒకవైపు సిరిసిల్లను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ఉందని, మరోవైపు ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్, అప్పుడప్పుడు దేవుడి పేరు చెప్పుకుని వచ్చే బీజేపీ ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటేయాలో ప్రజలే ఆలోచించి నిర్ణయించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ నేతలు తులం బంగారం ఇస్తామని చెప్పారని, కానీ వాళ్లు ఉన్న పుస్తెలే ఎత్తుకుపోయే రకమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తనపై కోపంతో బతుకమ్మ చీరలను నిలిపివేశారని, నేతన్నల బతుకుదెరువుపై దెబ్బ కొట్టారని విమర్శించారు. బీజేపీ నేతలు దేవుని గుడి వద్ద ఉండి అడుక్కుతినేవారిలా దేవుని పేరుతో ఓట్లు అడగడానికే వస్తారని వ్యాఖ్యానించారు.
అలాగే కాంగ్రెస్కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లా ఉనికే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. తులం బంగారం వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటేయాలని, రానివారు బీఆర్ఎస్కు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల బతుకుదెరువు లేకుండా చేసిన వారికి గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు.
