“బీఆర్‌ఎస్ అవినీతి పార్టీ అని కవితే చెబుతోంది – మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు”
మెదక్ | ఫిబ్రవరి 5, 2026:
బీఆర్‌ఎస్ ఒక అవినీతి పార్టీ అని ఆ మాట కేసీఆర్ బిడ్డ కవితనే చెబుతున్నదని తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి డా. వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో మిషన్ భగీరథ పేరుతో రూ.65 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మెదక్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మంత్రి, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పులు మోపారని అన్నారు. వడ్డీలకే ప్రతి నెల రూ.5 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకపోయినా, పార్టీకి మాత్రం రూ.వెయ్యి కోట్ల డిపాజిట్లు సేకరించారని, బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరు రూ.వందల కోట్ల సంపాదించుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 20 వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో ప్రజాధనం మూడు నియోజకవర్గాల్లోనే ఖర్చు అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రమంతటా సమానంగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. పదేళ్లుగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో ప్రజలను బీఆర్‌ఎస్ మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఏడుపాయలకు ముఖ్యమంత్రి కూడా రాలేదని, తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయించామని మంత్రి గుర్తుచేశారు. అలాగే మెదక్ సీఎస్‌ఐ చర్చికి సీఎం చేతుల మీదుగా రూ.29.30 కోట్ల నిధులు అందించామని తెలిపారు.
రోహిత్ రావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
