అన్ని మర్యాదలు మర్చిపోయారు: సీఎం రేవంత్‌పై కవిత ఆగ్రహం
హైదరాబాద్/చేవెళ్ల:
సీఎం రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ మర్యాదలను అతిక్రమించి మాట్లాడుతున్నారని, వెలమ జాతిని లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శించారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో ఎలాంటి భేదభావం లేకుండా అందరినీ గౌరవిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయి ఒకే జాతిని టార్గెట్ చేయడం తగదని హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. సీఎం తన వైఖరిని వెంటనే మార్చుకోవాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.
అదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై కూడా కవిత తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసునని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ బీఫామ్‌లు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్పీకర్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
అడ్వకేట్ స్వప్న హత్యపై ఆవేదన
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో అడ్వకేట్ స్వప్నను ఆమె సొంత కుటుంబ సభ్యుడే హత్య చేయడం తీవ్రంగా బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. స్వప్న తనకు ప్రాణహాని ఉందని ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు స్పందించలేదని ఆరోపించారు. పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే స్వప్న ఈరోజు బతికుండేదని అన్నారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్వప్న కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కవిత మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పోలీసులంటే భయం లేకపోవడంతోనే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
అడ్వకేట్ స్వప్న హత్యపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని, నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు.
హోం, మున్సిపల్, విద్యా శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి… ఏ శాఖనూ సరిగా పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదంలో 22 మంది మృతి చెందినా, గురుకులాల్లో విషాహారం తిని, పాములు కరిచి విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
