మేడ్చల్‌లో కాంగ్రెస్–బీఆర్ఎస్ ఘర్షణ, మల్లారెడ్డి అనుచరుడికి గాయాలు
మేడ్చల్:
మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్ ప్రాంతంలో గురువారం జరిగిన ఘర్షణలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్‌కు తలకు గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే… లాల్ గడి మలక్‌పేట్ గ్రామంలో మల్లారెడ్డి తన పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో, డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ ప్రచార రథంతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలను పెద్ద శబ్దంతో ప్లే చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పాటల శబ్దాన్ని తగ్గించాలని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను కోరగా, వారు స్పందించకపోవడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమేణా ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం. ఈ ఘటనలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడికి పాల్పడినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ దాడిలో మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్‌కు తలకు గాయాలు కావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరు పార్టీల నాయకుల వాంగ్మూలాలు తీసుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
