ఇరాన్‌లోని అమెరికన్లకు తక్షణ హెచ్చరిక: వెంటనే దేశం విడిచిపోవాలని యూఎస్ అలర్ట్, యుద్ధ భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
అమెరికా–ఇరాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో నివసిస్తున్న తమ దేశ పౌరులకు అమెరికా ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులు, దౌత్యవేత్తలు, ఇతర అధికారులు, అమెరికన్ పౌరసత్వం కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని యునైటెడ్ స్టేట్స్ స్పష్టం చేసింది. అర్జెంట్‌గా ఇరాన్ గడ్డను వీడాలని సూచిస్తూ వర్చువల్ యూఎస్ ఎంబసీ శుక్రవారం ప్రత్యేక అలర్ట్ విడుదల చేసింది.
ప్రాంతీయ భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నాయని, ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్థానిక మౌలిక సదుపాయాల్లో అంతరాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థల వైఫల్యం, రవాణా సేవలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. అందువల్ల వీలైనంత త్వరగా సురక్షిత దేశాలకు వెళ్లాలని అమెరికా పౌరులకు సూచించింది.
ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌లు, ల్యాండ్లైన్లు, ఇంటర్నెట్ సేవలపై తీవ్ర నియంత్రణలు విధిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. రహదారుల మూసివేతలు, ప్రజా రవాణాలో అంతరాయాలు, విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉండటంతో పరిస్థితి ఏ క్షణంలోనైనా విషమించవచ్చని పేర్కొన్నారు. ప్రయాణానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి సహాయం ఆశించకుండా, తమ స్వంత ఏర్పాట్లతోనే ఇరాన్‌ను విడిచిపెట్టాలని యూఎస్ ఎంబసీ స్పష్టం చేసింది.
ఒకవేళ వెంటనే దేశాన్ని విడిచి వెళ్లడం సాధ్యం కాకపోతే, తగినంత ఆహారం, తాగునీరు, అవసరమైన మందులను ముందుగా నిల్వ చేసుకోవాలని సూచించింది. అలాగే సురక్షితమైన భవనాల్లో తలదాచుకుని, ప్రజా నిరసనలు, గుంపులు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అమెరికా పౌరులు తమ మొబైల్ ఫోన్లు ఎప్పుడూ ఛార్జ్ చేసుకుని ఉంచాలని, కమ్యూనికేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సూచించింది.
ముఖ్యంగా అమెరికా–ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన వారికి ఈ హెచ్చరికలు మరింత కీలకంగా మారాయి. ఇరాన్ ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించదని, అలాంటి వారిని కేవలం ఇరాన్ పౌరులుగానే పరిగణిస్తుందని యూఎస్ ఎంబసీ గుర్తు చేసింది. అమెరికాతో సంబంధాలు ఉన్న వారిని ఇరాన్ అధికారులు ప్రశ్నించే, అరెస్ట్ చేసే లేదా నిర్బంధించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇదే సమయంలో ఒమన్ వేదికగా అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. చర్చలు ప్రారంభం కాకముందే అమెరికా ఇలాంటి కఠిన హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచవ్యాప్తంగా అనుమానాలకు దారితీస్తోంది. ఏ క్షణమైనా యుద్ధ పరిస్థితులు తలెత్తవచ్చన్న భయాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది.
