ఉప్పల్‌లో టీ కొట్టులో గంజాయి విక్రయం.. వర్కర్ అరెస్ట్
హైదరాబాద్: టీ తాగడానికి వెళ్లే చోటే గంజాయి అమ్మకం జరుగుతుందంటే నమ్మశక్యం కాకపోయినా, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఇదే ఘటన వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ హెడ్ పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న ఓ టీ కొట్టులో పని చేస్తున్న వర్కర్ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళితే…
టీ కొట్టులో పని చేస్తున్న ఉద్యానాథ్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం (ఫిబ్రవరి 6) పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో టీతో పాటు గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న ఉద్యానాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో, ఉద్యానాథ్ రోజూ టీ కొట్టుకు వచ్చే కస్టమర్లకు రూ.500కు గంజాయి ప్యాకెట్ విక్రయిస్తున్నట్లు తేలింది. టీ కొట్టు దగ్గరే తన స్కూటీలో గంజాయిని దాచుకుని అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ వ్యవహారం మొత్తం టీ కొట్టు ఓనర్‌కు తెలియకుండానే జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యానాథ్ బీదర్ నుంచి గంజాయిని తెప్పించి విక్రయిస్తున్నాడని, ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఓనర్ ఇచ్చే జీతం కంటే రెట్టింపు ఆదాయం సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దాడుల్లో నిందితుడి వద్ద నుంచి 730 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, స్కూటీతో పాటు నిందితుడిని ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
