ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం..! సెల్‌ఫోన్ చూస్తూ KSRTC బస్సు డ్రైవింగ్ – వీడియో వైరల్, డ్రైవర్ సస్పెన్షన్
ప్రయాణికుల ప్రాణాల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ఓ కర్ణాటక ఆర్టీసీ (KSRTC) బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బస్సు నిండా ప్రయాణికులు ఉన్నప్పటికీ, డ్రైవర్ సెల్ఫోన్లో రీల్స్ చూస్తూ బస్సు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో చోటు చేసుకుంది. మాండ్య నుంచి మైసూరు వైపు వెళ్తున్న KSRTC బస్సును డ్రైవర్ మహేష్ రద్దీ రోడ్డుపై నిర్లక్ష్యంగా నడిపాడు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఉన్నా, ప్రయాణికుల హెచ్చరికలను పట్టించుకోకుండా సెల్ఫోన్లో మునిగిపోయాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వణికిపోయారు.
డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు అతడి బాగోతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా మాండ్య–మైసూరు రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా పేరున్న మార్గం కావడంతో, ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందించారు. ఇది ప్రజాభద్రతకు తీరని ముప్పు అని పేర్కొంటూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డ్రైవర్ మహేష్‌ను సస్పెండ్ చేసినట్లు కర్ణాటక ఆర్టీసీ కార్పొరేషన్ ప్రకటించింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
