బస్తర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 51 మంది లొంగింపు – రూ.1.61 కోట్ల రివార్డు క్యాడర్ జనజీవనంలోకి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ జిల్లాలో మొత్తం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై కలిపి రూ.1.61 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం నాడు బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో జగదల్‌పూర్‌లో వీరంతా లొంగిపోయారు.
బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రం జగదల్‌పూర్‌లో జరుగుతున్న బస్తర్ పాండుమ్ 2026 ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాయపూర్‌కు వచ్చిన రోజునే ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అధికారుల వివరాల ప్రకారం, బీజాపూర్ జిల్లాలో 20 మంది మహిళా క్యాడర్‌తో సహా 30 మంది మావోయిస్టులు, అలాగే సుక్మా జిల్లాలో మరో 21 మంది లొంగిపోయారు. వీరిలో 14 మంది మహిళలు ఉన్నట్లు సుక్మా ఎస్పీ సుందరరాజ్ తెలిపారు. లొంగిపోయిన వారి వద్ద నుంచి కార్డెక్స్ వైర్లు, జెలటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం తరఫున రూ.50 వేల తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతోనే వీరంతా స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ, మిగిలిన మావోయిస్టు క్యాడర్ కూడా హింస మార్గాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే వారికి భద్రత, గౌరవంగా జీవించే అవకాశాలతో కూడిన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
