మేడారం జాతర హూండీల లెక్కింపు మూడో రోజు.. 140 హూండీల నుంచి రూ.2.01 కోట్లు – మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం
మేడారం సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు మూడో రోజూ కొనసాగింది. హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సజావుగా సాగుతోంది.
జాతర కోసం మొత్తం 828 హూండీలు ఏర్పాటు చేయగా, అందులో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూడో రోజు 140 హూండీలను తెరిచి లెక్కించగా రూ.2,01,21,440/- నగదు ఆదాయం లభించింది. అదనంగా విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.71,283/- వచ్చినట్లు వెల్లడించారు.
ఇంతకుముందు
- ఫిబ్రవరి 5న 125 హూండీల లెక్కింపులో రూ.2,49,65,000/-,
- ఫిబ్రవరి 6న 160 హూండీల లెక్కింపులో రూ.3,54,25,200/-,
అలాగే విదేశీ కరెన్సీ మార్పిడితో రూ.63,436/- ఆదాయం సమకూరింది.
మూడు రోజుల వ్యవధిలో మొత్తం 425 హూండీలను లెక్కించగా రూ.8,06,46,359/- మొత్తం ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మూడో రోజు లెక్కించిన నగదులో నుంచి రూ.2,01,92,723/- మొత్తాన్ని పర్యవేక్షణాధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హూండీల్లో భద్రపరచి సురక్షితంగా ఉంచినట్లు పేర్కొన్నారు. నాణేల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు వెల్లడించారు.
