భూమిని దాటి నింగిలోకి ఏఐ విప్లవం.. అంతరిక్షంలో AI డేటా సెంటర్లు: ఎలన్ మస్క్ సంచలన ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లపై నిరసనలు ఊపందుకుంటున్నాయి. డేటా సెంటర్ల వల్ల అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, పర్యావరణ కాలుష్యం పెరుగుతుందంటూ ముఖ్యంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, భవిష్యత్‌లో ఏఐ డేటా సెంటర్ల వల్ల ఏర్పడే ముప్పును ముందుగానే అంచనా వేసినట్లు కనిపిస్తోంది టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.
రాబోయే 30 నుంచి 36 నెలల్లో అంతరిక్షంలో AI డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు మస్క్ ప్రకటించారు. భూమిపై కంటే అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల 30 శాతం వరకు విద్యుత్ ఆదా సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మస్క్.. అంతరిక్షంలో డేటా సెంటర్ల వల్ల కలిగే ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలను వివరించారు. అంతరిక్షంలో పగలు–రాత్రి భేదం లేకుండా 24 గంటలూ సోలార్ పవర్ ఉత్పత్తి సాధ్యమవుతుందని, తుఫాన్లు, వర్షాలు, వాతావరణ మార్పులు లేవని చెప్పారు. భూమిపై కంటే అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్ సామర్థ్యం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
వాతావరణం లేకపోవడం వల్ల ఎనర్జీ వేస్టేజ్ 30 శాతం వరకు తగ్గుతుందని, రాత్రిపూట విద్యుత్ కోసం ఖరీదైన బ్యాటరీల అవసరం ఉండదన్నారు. అంతేకాదు, కూలింగ్ కోసం నీళ్ల అవసరం కూడా ఉండదని పేర్కొన్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు ఇది అత్యుత్తమ మార్గమని మస్క్ అభిప్రాయపడ్డారు.
ఏఐ శిక్షణలో ఉపయోగించే జీపీయూల (GPUs) విశ్వసనీయతపై వస్తున్న విమర్శలను కూడా మస్క్ కొట్టిపారేశారు. ప్రారంభ దశలో చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నా, ఒకసారి స్థిరపడిన తర్వాత ఈ చిప్స్ చాలా కాలం పాటు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. ఎన్విడియా, టెస్లా లేదా ఇతర కంపెనీలు తయారు చేసే చిప్స్‌కు తరచూ సర్వీసింగ్ అవసరం ఉండదని, అందుకే వాటిని అంతరిక్షంలో నిర్వహించడం సులభమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రణాళిక విజయవంతమైతే, ఏఐ మౌలిక సదుపాయాల భవిష్యత్తు భూమిని దాటి అంతరిక్షానికి విస్తరించే అవకాశం ఉందని ఎలన్ మస్క్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
