రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు భారీ స్పందన.. తొలి రోజే రూ.56 కోట్ల ఆదాయం
హైదరాబాద్:
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని తొర్రూర్ ప్రాంతంలో ఉన్న 105 ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియకు కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ బహిరంగ వేలం శనివారం బాట సింగారంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రారంభమైంది. తొలి రోజున 70 ఓపెన్ ప్లాట్లను విజయవంతంగా విక్రయించారు. ఈ వేలంలో గరిష్టంగా చదరపు గజం రూ.45 వేల వరకు ధర పలికింది.
తొర్రూర్తో పాటు ఓఆర్ఆర్కు సమీపంలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లను వేలం ద్వారా విక్రయించేందుకు గత నెలలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం నిర్వహించిన వేలం ద్వారా సుమారు రూ.56 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.
200 నుంచి 300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధర (అప్సెట్ ప్రైజ్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లు రూ.45 వేలు, రూ.43 వేలు, రూ.41 వేల ధరలకు అమ్ముడయ్యాయి. మొత్తం మీద వేలంలో విక్రయమైన భూములు సగటున చదరపు గజం రూ.31 వేల చొప్పున అమ్ముడుపోయాయి.
ఈ వేలం ప్రక్రియలో కార్పొరేషన్ సీఈ రమణారెడ్డి, ఈఈ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొర్రూర్ లేఅవుట్లోని మరో 35 ఓపెన్ ప్లాట్లు, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని 32 ఓపెన్ ప్లాట్లకు ఆదివారం వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
పోచారం, బండ్లగూడలో 71 ఫ్లాట్ల కేటాయింపు
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీల్లో మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఫ్లాట్లలో 71 ఫ్లాట్లను లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులకు కేటాయించింది. దీని ద్వారా కార్పొరేషన్‌కు సుమారు రూ.11 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
