కేసీఆర్ పదేండ్ల దోపిడీ చరిత్ర గోడల మీద రాయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :
కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన దోపిడీ, ద్రోహాల చరిత్రను గోడల మీద రాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన తప్పుల చరిత్రను ఎవ్వరూ చెరపలేరని స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో శనివారం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం “ప్రజా పాలన – ప్రగతి బాట” పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,
‘‘కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు, దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్రను ఎవరు తుడిచేయగలరు? ఇంటికో ఉద్యోగం ఇస్తానని 1,200 మందిని పొట్టన పెట్టుకొని, వారి శవాల మీద సీఎం అయి తెలంగాణ ద్రోహిగా మారిన చరిత్ర తెలంగాణ ఉన్నంత కాలం చెరిగిపోదు’’ అని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులు చేసిన కేసీఆర్‌కు పోలీసులు నోటీసులు ఇస్తే తప్పేమిటని సీఎం ప్రశ్నించారు.
‘‘జడ్జీలు, జర్నలిస్టులు, సినిమా తారలు, భార్యాభర్తల ఫోన్ కాల్స్ కూడా వదలకుండా చాటుగా విన్నరు. ఇలాంటి పనులు చేస్తే చేతికి బేడీలు వేసి ఈడ్చుకురావాలి. వయసుకు గౌరవం ఇచ్చి బంజారాహిల్స్ ఇంట్లో విచారణకు రమ్మన్నా, దానిపైనా రాద్ధాంతం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు తాను కేసీఆర్ చరిత్రను తుడిచేస్తున్నానని ఆరోపిస్తున్నారని, అలాంటి అవసరం తనకు లేదన్నారు.
‘‘మీ చరిత్ర దొంగ పాస్‌పోర్టులది, దొంగ నోట్లది, దళితులకు దగా చేసిన చరిత్ర, తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిన చరిత్ర. దాన్ని ఎవ్వరూ చెరపలేరు’’ అని అన్నారు.
రంగారెడ్డి జిల్లాను నిర్లక్ష్యం చేశారు
కేసీఆర్ పదేండ్ల నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని సీఎం ఆరోపించారు.
‘‘పక్క రాష్ట్రాల కోసం మాట్లాడిన కేసీఆర్, హైదరాబాద్ పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వడం మరిచారు’’ అని విమర్శించారు.
వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదని, దీంతో వందల కోట్లు ఖర్చు చేసి తవ్విన అండర్ గ్రౌండ్ టన్నెల్ పనులు ఆగిపోయాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు సంవత్సరాల్లోనే అది ‘కూలేశ్వరం’గా మారిందని ఎద్దేవా చేశారు.
బీజేపీపై సెటైర్
‘‘మోదీని చూసి ఓటేయాలంటున్నారు. గల్లీలో ఉండే నాయకుడు పని చేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాలా?’’ అంటూ సీఎం సెటైర్ వేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో అవి బయటపడుతున్నాయని ఆరోపించారు.
ఎనిమిదేండ్లు ఇందిరమ్మ రాజ్యమే
రాబోయే ఎనిమిదేండ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుందని సీఎం జోస్యం చెప్పారు. ఇప్పటివరకు నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు వంటి అనేక హామీలు అమలు చేశామని వివరించారు. ట్రిపుల్ ఆర్, ప్రాణహిత–చేవెళ్ల, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్–బీజేపీకి చీకటి ఒప్పందాలు: శ్రీధర్ బాబు
మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీజేపీ బీ ఫాంలను బీఆర్ఎస్ కార్యాలయంలో ఇచ్చినట్టు ఆయా పార్టీల నేతలే చెప్పారని తెలిపారు.
