టీఎన్జీవో పేరు మార్పు వివాదం.. ఆస్తుల గుప్పిట్లోకే ఎత్తుగడ? హైకోర్టు స్టేటస్‌కో
హైదరాబాద్ :
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో అంతర్గత లుకలుకలు బహిర్గతమవుతున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో)లో పదవీ వ్యామోహం తీవ్రస్థాయికి చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంఘంలో కీలక పదవుల్లో ఉన్న కొందరు నేతలు తమ కుర్చీలను కాపాడుకోవడానికే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
టీఎన్జీవోలో కీలకంగా ఉన్న ఒకరికి గెజిటెడ్ అధికారిగా పదోన్నతి రాగా, మరో ముగ్గురు పదోన్నతులు వచ్చినా వాటిని స్వీకరించకుండా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ప్రమోషన్ తీసుకుంటే గెజిటెడ్ అధికారిగా మారాల్సి వస్తుందని, అలా జరిగితే నాన్ గెజిటెడ్ సంఘాన్ని వీడాల్సి వస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
పదవులు కావాలి.. ప్రమోషన్లు వద్దా?
ప్రమోషన్ తీసుకున్నా సంఘం పదవుల్లో కొనసాగేందుకు వీలుగా టీఎన్జీవో పేరు, బైలాస్ మార్చే యత్నం జరుగుతుండటం తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్’ అనే పేరులోని ‘నాన్ గెజిటెడ్’ పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్’గా పేరు మార్చాలని నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తద్వారా అబ్రివియేషన్ (టీఎన్జీవో) మారకుండా ఉంచి, గెజిటెడ్ హోదాలోనూ సంఘంపై పెత్తనం చెలాయించవచ్చనే వ్యూహమే దీనికి కారణమని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ప్రయత్నం వెనుక ఉద్యోగ సంఘాలకు చెందిన వందల, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్యం కోల్పోకూడదనే ఉద్దేశం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చర్యకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో పాటు గెజిటెడ్ అధికారుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
హైకోర్టులో టీజీవో పిటిషన్
ఈ పేరు మార్పు, బైలాస్ సవరణ యత్నాలపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. గెజిటెడ్ అధికారులుగా మారిన వారు తప్పనిసరిగా టీజీవోలోనే చేరాలనీ, నాన్ గెజిటెడ్ సంఘ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొంది.
విచారణ జరిపిన హైకోర్టు, గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ సంఘాల్లో సభ్యులుగా ఉండకూడదని స్పష్టం చేస్తూ, జీఓ ఎంఎస్ నం.264కు విరుద్ధంగా జరుగుతున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారుల కమిటీని ఆదేశిస్తూ స్టేటస్‌కో విధించింది.
‘గెజిటెడ్ పెత్తనం వద్దు’
పేరు మార్పు యత్నాన్ని సాధారణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
‘‘గెజిటెడ్ అధికారుల ఆధిపత్యంలో ఉంటే కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు ఎవరు పట్టించుకుంటారు?’’ అని వారు ప్రశ్నిస్తున్నారు. సంఘం పేరులో ‘నాన్ గెజిటెడ్’ పదాన్ని తొలగించడం అంటే సంఘం ఆత్మనే చంపేయడమేనని వారు వాపోతున్నారు. నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘం మూల సూత్రాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేల కోట్ల ఆస్తులే అసలు కారణమా?
ఈ వివాదానికి మూలకారణం సంఘాలకు చెందిన భారీ ఆస్తులేనని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎన్జీవో, టీజీవో సంఘాలకు వేల కోట్ల రూపాయల విలువైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్సులు ఉన్నట్లు అంచనా. టీఎన్జీవోకు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆస్తుల నుంచి నెలకు రూ.2 కోట్లకు పైగా అద్దె ఆదాయం వస్తోందని సమాచారం.
ఈ నిధులపై సరైన ఆడిటింగ్ జరగడం లేదని, అధికారిక లెక్కల్లో చాలా తక్కువ మొత్తమే చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్ లేకపోవడం వల్లే నిధుల దుర్వినియోగం జరుగుతోందని, ఈ పెత్తనం కోల్పోకూడదనే పేరు మార్పు జిమ్మిక్కులు చేస్తున్నారని క్షేత్రస్థాయి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఎవరికి వారే.. ఉద్యోగ జేఏసీ చీలిక
టీజీవో, టీఎన్జీవో సంఘాలు కలిసి జేఏసీగా పనిచేస్తున్నప్పటికీ, ఈ వివాదంతో రెండు సంఘాలు ఎదురెదురుగా నిలిచాయి. మరోవైపు రెవెన్యూ తదితర శాఖల సంఘాలు వేరుగా ఉండటంతో ఉద్యోగ సంఘాల ఐక్యత దెబ్బతింటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాగే కొనసాగితే ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రమాదంలో పడుతుందన్న అభిప్రాయం బలపడుతోంది.
