జాతీయ భద్రతకు ముప్పు ఉంటే పాస్‌పోర్టు రద్దు చట్టబద్ధమే
ఉర్దూ జర్నలిస్టు అక్రమ్ అలీ పాస్‌పోర్టు రెన్యువల్ కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్ :
హైదరాబాద్‌కు చెందిన ఉర్దూ పత్రిక జర్నలిస్టు అక్రమ్ అలీ మహ్మద్ పాస్‌పోర్టు రెన్యువల్‌కు అధికారులు నిరాకరించడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. దేశ సమగ్రత, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు పాస్‌పోర్టును రద్దు చేయడం లేదా పునరుద్ధరణ నిరాకరించడం పూర్తిగా చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. పాస్‌పోర్టు పొందడం మౌలిక హక్కు కాదని, అది ప్రభుత్వ నియంత్రణలో ఉండే సౌకర్యమేనని కోర్టు తేల్చి చెప్పింది.
దేశ భద్రతకు సంబంధించిన అంశాల ముందు సహజ న్యాయసూత్రాలు వర్తించవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు రెన్యువల్‌పై అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇంటెలిజెన్స్ అధికారుల లేఖ ఆధారంగా పాస్‌పోర్టును రద్దు చేశామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అథారిటీ పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ అక్రమ్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, పిటిషనర్ చర్యలు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం నుంచి రహస్య నివేదిక అందిందని కోర్టుకు తెలిపారు. అంతేకాదు, పిటిషనర్‌కు ఐఎస్ఐ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని పేర్కొన్నారు.
వాదనలు, రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి.. పిటిషనర్ చర్యలు జాతీయ భద్రతను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున పాస్‌పోర్టు రద్దు చట్టబద్ధమేనని తేల్చారు. దేశ భద్రత అంశాల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టు జోక్యం పరిమితంగానే ఉంటుందని పేర్కొంటూ పిటిషన్‌ను పూర్తిగా డిస్మిస్ చేశారు.
