దుబ్బాక అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
దుబ్బాక:
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాక డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తాను బాధ్యత తీసుకుంటే వంద రోజులలో డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తానని, డబుల్ బెడ్రూం కాలనీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజల సొమ్మును దోచుకుని కుటుంబంలోనే పంచుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించిన ఆయన, ఆ పార్టీ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇటీవల చేసిన నిరసనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నిధులను తీసుకెళ్లి కేవలం కల్వకుంట్ల కుటుంబానికి చెందిన నియోజకవర్గాల్లోనే ఖర్చు చేశారని ఆరోపించారు.
దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. అన్ని 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే దిశగా తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
