కొడవటంచను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
రేగొండ:
రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ ప్రతిష్టాపనతో పాటు గ్రామ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదివారం ఘనంగా శ్రీకారం చుట్టారు. రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్ ప్రతిష్టాపన పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రావి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేవాలయాల పునరుద్ధరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. పర్యాటక అవకాశాలు పెరిగి స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. కొడవటంచ గ్రామాన్ని భవిష్యత్తులో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు.
ఆలయ పునర్ ప్రతిష్టాపన అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం ద్వారా గ్రామ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
