మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేడు తెర… సాయంత్రం 5 నుంచి సైలెన్స్ పీరియడ్
హైదరాబాద్ :
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం చివరి రోజు. సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి అధికారికంగా తెరపడనుంది. చివరి రోజు కావడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సహా అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడపనున్నారు. కార్నర్ మీటింగ్‌లు, బైక్ ర్యాలీలు, డోర్ టు డోర్ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటనకు షెడ్యూల్ చేసినప్పటికీ సమయం సరిపోక రద్దు చేసినట్లు స్థానిక నేతలు తెలిపారు. ఎన్నికల కోడ్ ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీంతో సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆదేశించారు. ఈ సమయంలో బయటి నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు పట్టణాలను విడిచిపోవాలని సూచించారు.
పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉండగా, మరోవైపు పట్టణాల్లో మద్యం ప్రవాహం పెరిగినట్లు సమాచారం. ఓట్ల కోసం డబ్బులు పంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారులకు చిక్కకుండా బంధువుల ద్వారా యూపీఐ లావాదేవీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైలెన్స్ పీరియడ్‌లో ప్రచార కార్యక్రమాలపై పూర్తి నిషేధం ఉంటుందని, ప్రజలు గుంపులుగా చేరరాదని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని విభాగాల నోడల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 13న కూడా డ్రైడే అమలు చేస్తామని స్పష్టం చేసింది. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.
చివరి రోజు ప్రచారంలో ముఖ్య నేతలు
చివరి రోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు సోమవారం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్‌లో, తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి, కల్లూరులో ప్రచారం చేయనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని పలు పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు. వెంకట్ రెడ్డి నల్గొండ కార్పొరేషన్‌లో బైక్ ర్యాలీలో పాల్గొననుండగా, పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో ప్రచారం చేస్తారు.
బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్‌లో ప్రచారం చేయనుండగా, కేటీఆర్ భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ జిల్లా పరకాలలో, హరీశ్ రావు దుబ్బాకలో ప్రచారం చేయనున్నారు.
రామగుండంలో కిషన్ రెడ్డి సభ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామగుండం కార్పొరేషన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నిర్మల్, నిజామాబాద్‌లలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు.
పీఓ, ఏపీఓలకు శిక్షణ పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి శిక్షణ పూర్తయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 10న పోలింగ్ మెటీరియల్ పంపిణీ, పోలింగ్ అనంతరం మెటీరియల్ స్వీకరణ విధానాలపై అవగాహన కల్పించారు. బ్యాలెట్ విధానంలో జరిగే ఎన్నికల నేపథ్యంలో రెండు విడతలుగా ర్యాండమైజేషన్ చేసి సిబ్బందిని సిద్ధం చేశారు.
