అర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ టవర్లు… హౌసింగ్ శాఖ ఫోకస్
హైదరాబాద్:
రూరల్ ప్రాంతాల్లో శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అర్బన్ ఏరియాల్లో ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రూరల్ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జీ ప్లస్ 3 లేదా జీ ప్లస్ 5 ఫ్లోర్లలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. వీటి పనులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే ఏప్రిల్ నుంచే ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ఇళ్లు అందించేందుకు ఎంఐజీ, ఎల్ఐజీ కాలనీలు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మూడు ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కేటాయింపులపై హౌసింగ్ శాఖ ఇప్పటికే ఫైనాన్స్ శాఖకు ప్రతిపాదనలు పంపించింది.
త్వరలో హౌసింగ్ మంత్రితో రివ్యూ సమావేశం నిర్వహించి, అనంతరం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో శాఖలవారీగా సమీక్షలు చేపట్టనున్నారు.
ఏప్రిల్ నుంచే పనులు ప్రారంభం
అర్బన్ ఏరియాల్లో చేపట్టే ఇందిరమ్మ టవర్లను ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జీహెచ్ఎంసీలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సొంత స్థలం లేని అర్హులైన లబ్ధిదారుల కోసం స్లమ్ ఏరియాలు, ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పంపించాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ శాఖ ఆదేశించింది. ఇప్పటికే ఆయా వివరాలు హౌసింగ్ శాఖకు చేరాయి.
నగర ప్రాంతాల్లో సొంత స్థలం లేని వేలాది మందికి ఈ విధానం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఒకేచోట వందలాది కుటుంబాలు నివసించేలా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఈ టవర్లను నిర్మించనున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో నివసించే ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ఇందిరమ్మ టవర్ల నిర్మాణ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 19 చోట్ల స్లమ్ ఏరియాలను గుర్తించగా, ఇతర జిల్లాల్లోనూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు అనువైన భూములపై సర్వేలు చేస్తున్నారు.
జీ ప్లస్ 3 / 5లో టవర్లు
గుర్తించిన ప్రాంతాల్లో జీ ప్లస్ 3 లేదా జీ ప్లస్ 5 ఫ్లోర్లలో ఇందిరమ్మ టవర్లు నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా పార్కింగ్‌కు కేటాయించి, ఒక్కో ఫ్లోర్లో రెండు ఇళ్ల చొప్పున మూడు టవర్లలో మొత్తం 12 ఇళ్లు నిర్మించనున్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులన్నీ కల్పించనున్నారు.
మౌలిక వసతులు కలిపి ఒక్కో ఇంటికి సుమారు రూ.8 లక్షల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుండగా, రూరల్ ప్రాంతాల్లో రూ.72 వేలును, అర్బన్ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. మిగతా సుమారు రూ.3 లక్షల నిధులను మెప్మా ద్వారా వివిధ మార్గాల్లో సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అర్బన్ ఏరియాల్లోనూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ ప్రకటనకు సిద్ధం
రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి తక్కువ ధరకు ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకురానుంది. వచ్చే నెల ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ పాలసీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ పాలసీ సిద్ధమైంది.
త్వరలో బిల్డర్లతో, ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ సంస్థతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల్లో ఎంఐజీ, ఎల్ఐజీ టవర్లను నిర్మించనున్నారు. హౌసింగ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా చేసుకుని టెండర్లు పిలిచి ప్రైవేట్ బిల్డర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని ఫైనాన్స్ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
