నల్గొండ జిల్లాలో చైర్పర్సన్ సీట్లపై గంపెడాశలు
అభ్యర్థుల ప్రకటన లేకుండానే ప్రచారం.. ఆశావహుల్లో టెన్షన్
నల్గొండ:
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గెలుపు టెన్షన్‌తో పాటు చైర్పర్సన్ సీటు దక్కుతుందా? అన్న ఉత్కంఠ వెంటాడుతోంది. నల్గొండ కార్పొరేషన్ మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సతీమణి బుర్రి స్రవంతిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారికంగా ప్రకటించారు. అలాగే సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
ఈ రెండు మున్సిపాలిటీలను మినహాయించి జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో చైర్పర్సన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రధాన పార్టీలు చైర్పర్సన్ అభ్యర్థుల ప్రకటన లేకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.
ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ సీటుపై ఆశతో ఆశావహులు భారీగా ఖర్చు పెడుతున్నారు. తమ గెలుపుతో పాటు పార్టీ వార్డు సభ్యుల గెలుపు బాధ్యతను కూడా తామే భుజాన వేసుకుని ప్రచారాన్ని నడుపుతున్నారు. ఇంత చేసినా చివరికి పార్టీకి మెజార్టీ వస్తుందా? తానే అధికారిక అభ్యర్థిగా నిలుస్తానా? అన్న టెన్షన్‌తో ఆశావహులు ఉన్నారు.
చైర్పర్సన్ రేసులో పలువురు
నల్గొండ, సూర్యాపేట మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఎవరికి వారే తామే చైర్పర్సన్ అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కొంతమంది ఆశావహులకు పార్టీ పెద్దలు అంతర్గతంగా హామీ ఇచ్చినట్టు చెబుతుండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది.
నల్గొండ జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి గుడిపాటి శిరీష, నూకల కవిత వేణుగోపాల్, షాగా జయలక్ష్మీ జలేందర్, చిలుకూరు సుధా బాలు చైర్పర్సన్ సీటు కోసం ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి పద్మశెట్టి లక్ష్మీ కోటేశ్వరరావు రేసులో ఉన్నట్లు సమాచారం.
హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి చింతల చంద్రారెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నుంచి నల్గొండ సుధాకర్ పోటీ పడుతున్నారు.
నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్‌గా మానస స్వర్ణ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఎర్ర మంజుశ్రీ బరిలో ఉన్నారు.
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా పందిరి గీతా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
సూర్యాపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి
సూర్యాపేట జిల్లాలోని కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి ఎర్నేని కుసుమబాబు, దేవరపల్లి మల్లీశ్వరి, గుండపనేని పద్మావతితో పాటు పలువురు నేతలు చైర్పర్సన్ సీటు ఆశలతో రంగంలో ఉన్నారు.
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ నుంచి దొంతగాని శ్రీనివాస్, తన్నీరు మల్లికార్జున్ రావు పేర్లు వినిపిస్తుండగా, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది.
అధికారిక ప్రకటనలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా చైర్పర్సన్ సీట్లపై రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల ఫలితాల తర్వాతే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.
