70 వేల డాలర్ల వద్ద బిట్‌కాయిన్ కన్సోలిడేషన్
క్రిప్టో మార్కెట్ ‘రిపేర్ మోడ్’లోకి..!
డిజిటల్ డెస్క్:
ఫిబ్రవరి నెలలో తీవ్ర ఒడిదుడుకులతో ప్రారంభమైన క్రిప్టో మార్కెట్ ప్రస్తుతం క్రమంగా స్థిరత్వం వైపు అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 9 నాటికి బిట్‌కాయిన్ ధర 70 వేల డాలర్ల పరిధిలో కన్సోలిడేట్ అవుతూ ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గత వారం 60 వేల డాలర్ల దిగువకు జారిన బిట్‌కాయిన్, ఇప్పుడు 68 వేల నుంచి 72 వేల డాలర్ల మధ్య కదలాడుతోంది.
అయితే ఈ పెరుగుదల ఒక స్పష్టమైన బుల్లిష్ ట్రెండ్ కాదని, మార్కెట్ తనను తాను సరిదిద్దుకుంటున్న దశ (Consolidation Phase) అని ఇన్వెస్ట్మెంట్ నిపుణులు చెబుతున్నారు.
టెక్నికల్ లెవెల్స్ కీలకం
టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం 70 వేల డాలర్లు ఒక కీలక మానసిక స్థాయిగా మారింది.
- ధర పడితే 68 వేల డాలర్ల వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది
- అక్కడినుంచి మరింత దిగువకు జారితే 60 వేల – 62 వేల డాలర్ల జోన్ అత్యంత కీలక డిమాండ్ ఏరియాగా పనిచేయనుంది
- మరోవైపు ధర పైకి వెళ్లాలంటే 74 వేల – 75 వేల డాలర్ల రెసిస్టెన్స్‌ను అధిగమించాల్సి ఉంటుంది
80 వేల డాలర్ల పైన భారీ సప్లై ఉండటంతో, గతంలో అక్కడ జరిగిన ర్యాలీలు విఫలమైన ఉదాహరణలు ఉన్నాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
షార్ట్‌టర్మ్ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి
ఆన్-చైన్ డేటా ప్రకారం స్వల్పకాలిక ఇన్వెస్టర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు. గతంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిన వారు, ధర కొద్దిగా పెరిగిన ప్రతిసారి నష్టాలను తగ్గించుకునేందుకు అమ్మకాలకు దిగుతున్నారు. దీంతో మార్కెట్లో పైకి వెళ్లే ఊపు పరిమితమవుతోంది.
ఇక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విషయానికొస్తే.. ఫిబ్రవరి 6న దాదాపు 330 మిలియన్ డాలర్ల నెట్ ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. అయితే ఇవి పూర్తిస్థాయి విశ్వాసంతో చేసిన పెట్టుబడులు కాకుండా, వ్యూహాత్మక కొనుగోళ్లుగా మాత్రమే చూడాలని విశ్లేషకులు అంటున్నారు.
అమెరికా డేటాపై మార్కెట్ చూపు
ఫిబ్రవరి 10–11 తేదీల్లో విడుదల కానున్న అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం, రిటైల్ సేల్స్ గణాంకాలపై క్రిప్టో మార్కెట్ కళ్లుపెట్టింది. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గకపోతే, వడ్డీ రేట్ల కోత మరింత ఆలస్యం కావచ్చు. ఇది క్రిప్టో వంటి రిస్క్ అసెట్స్‌పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఆల్ట్‌కాయిన్స్ స్థిరంగా
ఆల్ట్‌కాయిన్స్ మార్కెట్లో
- ఎథీరియం 2 వేల డాలర్ల పైన నిలకడగా కొనసాగుతోంది
- బీఎన్బీ, సోలానా కూడా పరిమిత పరిధిలో ట్రేడవుతున్నాయి
పెద్ద ఎత్తున ర్యాలీ సంకేతాలు మాత్రం ఇప్పట్లో కనిపించడం లేదు.
తొందరపడొద్దు: నిపుణుల హెచ్చరిక
మార్కెట్ ప్రస్తుతం ‘రిపేర్ మోడ్’లో ఉన్నందున ర్యాలీలను తొందరపడి ఫాలో అవ్వొద్దని జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ ఇన్వెస్టర్లకు సూచించారు.
60 వేల – 62 వేల డాలర్ల స్థాయికి వచ్చినప్పుడు నెమ్మదిగా పెట్టుబడులు పెట్టడం మంచిదని, అలాగే క్రిప్టో SIPల ద్వారా పెట్టుబడిని యావరేజ్ చేసుకోవడం అస్థిరత నుంచి రక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు.
మొత్తానికి కొత్త ఏడాదిలో క్రిప్టో మార్కెట్ ఇప్పటికీ బేర్ సైకిల్ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదని, ఓపికతో వ్యవహరించాల్సిన దశ ఇదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
