తునిలో ఏటీఎం చోరీకి యత్నం.. ఝార్ఖండ్ వాసి అరెస్ట్
తుని పట్టణం, న్యూస్‌టుడే:
కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఏటీఎం చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో జీఎన్టీ రోడ్డులోని రామా థియేటర్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఏటీఎం యంత్రాన్ని రాయితో పగులగొట్టే ప్రయత్నం చేశాడు. అనంతరం ఇనుప ఊచ సహాయంతో కింద డోర్ తెరిచి, లోపల నగదు ఉండే తలుపును విప్పేందుకు యత్నించాడు. ఈ ప్రయత్నం సుమారు 20 నిమిషాల పాటు కొనసాగింది.
సీసీ కెమెరాల ద్వారా ఈ ఘటనను గుర్తించిన బ్యాంకు కేంద్ర నిఘా విభాగం సిబ్బంది వెంటనే బ్రాంచి మేనేజర్ సౌజన్యకుమారికి సమాచారం అందించారు. ఆమె ఈ విషయాన్ని తుని సీఐ గీతారామకృష్ణకు తెలియజేయడంతో పోలీసులు, బ్యాంకు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చోరీ యత్నం విఫలమవడంతో అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తిని పోలీసులు గాలించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఝార్ఖండ్‌కు చెందిన 35 ఏళ్ల రంజిత్‌కుమార్ జాదవ్‌గా గుర్తించారు. గతంలో అతడు తునిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఉద్యోగం రెగ్యులరైజ్ కాకపోవడంతో ఆ పని వదిలేసినట్లు వెల్లడించారు.
గత రెండేళ్లుగా నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివసిస్తున్న సోదరుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా టికెట్ లేకుండా రైలు ఎక్కిన అతడిని టీటీఈ తునిలో దించేశాడు. అనంతరం పట్టణంలో తిరుగుతూ నగదు కోసం ఏటీఎం చోరీకి యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
