బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్
చిన్నారిపై అత్యాచారం దిగ్భ్రాంతికరం – నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు: ఎమ్మెల్యే
భూపాలపల్లి/రేగొండ, ఫిబ్రవరి 9:
రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) అన్నారు.
సోమవారం ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని, ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
అభం శుభం తెలియని చిన్నారిపై ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత హేయమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఈ ఘటనలో నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను నిరంతరం పర్యవేక్షణ చేస్తానని స్పష్టం చేశారు.
