పబ్జీ ఆడుతూ కుప్పకూలిన యువకుడు
గేమ్ ఒత్తిడితో బీపీ 300కు పైగా – నరాలు చిట్లి మృతి
మీరట్‌లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ దుర్మరణం
మీరట్ (ఉత్తరప్రదేశ్):
సెల్‌ఫోన్ గేమ్స్‌పై పెరుగుతున్న వ్యసనం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు మహ్మద్ కైఫ్ పబ్జీ (PUBG) గేమ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మీరట్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖేర్ నగర్లో నివసిస్తున్న మహ్మద్ కైఫ్ అత్యంత యాక్టివ్ యువకుడిగా కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకుని పబ్జీ గేమ్ ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఢిల్లీలోని హోప్ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం, గేమ్ ఆడుతున్న సమయంలో తీవ్ర ఒత్తిడికి గురైన కైఫ్‌కు బీపీ అకస్మాత్తుగా అత్యధికంగా పెరిగింది. రక్తపోటు 300 కంటే ఎక్కువగా నమోదు కావడంతో మెదడులో రక్తస్రావం జరిగి, రక్తనాళాలు మరియు నరాలు చిట్లిపోయినట్లు తెలిపారు.
కైఫ్ తండ్రి ఫరూఖ్ మాట్లాడుతూ, తన కుమారుడు గత పదేళ్లుగా హై బీపీ సమస్యతో బాధపడుతున్నాడని, దీనికి సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నాడని వెల్లడించారు. ఈ క్రమంలో పబ్జీ గేమ్ ఆడేటప్పుడు ఏర్పడిన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా బీపీ మరింతగా పెరిగి ప్రాణాంతక స్థాయికి చేరిందని వైద్యులు చెప్పారని తెలిపారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో గేమ్స్‌కు సంబంధించిన ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం ముగ్గురు అక్కాచెల్లెల్లు కొరియన్ గేమ్ ప్రభావంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరచిపోక ముందే, ఈ సంఘటన జరగడం గేమింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో సూచిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
22 ఏళ్ల వయసులో ఒక యువకుడు గేమ్ ఒత్తిడికి బలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గేమింగ్, డిజిటల్ వ్యసనాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
