టెలిగ్రామ్‌లో ఒక్క మెసేజ్… రూ.70 లక్షల మోసం
బిట్‌కాయిన్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఘాతుకం
బెంగళూరులో ప్రైవేట్ ఈక్విటీ ఉద్యోగి భారీగా నష్టపోయిన వైనం
బెంగళూరు:
ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశ చూపిస్తూ ‘బిట్‌కాయిన్’ పేరుతో నిలువునా ముంచేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలో పనిచేస్తున్న 50 ఏళ్ల ఉద్యోగి ఇలాంటి ఓ భారీ మోసానికి గురై ఏకంగా రూ.70 లక్షలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఒక్క మెసేజ్ అతడి జీవితాన్నే తలకిందులు చేసింది.
ఈ మోసం 2025 నవంబర్ 30న మొదలైంది. బాధితుడికి టెలిగ్రామ్‌లో ప్రియా అగర్వాల్ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను వేరే వ్యక్తికి పంపాల్సిన మెసేజ్ పొరపాటున ఇతనికి పంపానని ఆమె చెప్పింది. అక్కడితో ఆగకుండా రోజూ చాటింగ్ మొదలైంది. కొద్ది రోజులకే ఆ సంభాషణ వాట్సాప్‌కు మారింది.
బ్రిటన్ నెంబర్ ఉపయోగిస్తున్న ఆమె, తాను లివర్‌పూల్‌లో ఉంటానని, కుటుంబ వ్యాపారం నిర్వహిస్తున్నానని చెప్పి బాధితుడి నమ్మకాన్ని పూర్తిగా సంపాదించింది. ఆ తర్వాత అసలు గేమ్ మొదలైంది. గత నాలుగేళ్లుగా బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పిన ఆమె, మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ప్రలోభపెట్టింది.
ఆమె మాటలు నమ్మిన బాధితుడు ఆమె పంపిన ఓ నకిలీ ట్రేడింగ్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేశాడు. మొదట రూ.50 వేల పెట్టుబడితో ప్రారంభించి, 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి 14 మధ్య మొత్తం ఎనిమిది విడతల్లో రూ.70 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇందుకోసం తన సేవింగ్స్‌తో పాటు బ్యాంకుల నుంచి అప్పులు కూడా చేశాడు.
నకిలీ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌లో అతడి పెట్టుబడిపై దాదాపు రూ.2.6 కోట్ల లాభం వచ్చినట్లు చూపించడంతో అది నిజమేనని నమ్మాడు. అయితే ఆ డబ్బును విత్‌డ్రా చేయాలని ప్రయత్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. అతడి అకౌంట్‌ను ఫ్రీజ్ చేసిన సైబర్ నేరగాళ్లు, డబ్బు విడుదల చేయాలంటే టాక్స్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మరికొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అప్పుడే తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని, అధిక లాభాల ఆశ చూపే క్రిప్టో, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కీమ్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా, ఇలాంటి మోసాలు మాత్రం ఆగడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
