టీ20 వరల్డ్ కప్ వేళ అభిషేక్ శర్మ అస్వస్థత – నమీబియా మ్యాచ్‌కు డౌట్
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ మధ్యలో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అస్వస్థతకు గురికావడం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. మంగళవారం (ఫిబ్రవరి 10) రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో అతడు ఆసుపత్రిలో చేరాడు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
గురువారం (ఫిబ్రవరి 12) నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు అభి ఆసుపత్రిలో చేరడం జట్టుకు ఆందోళనకర పరిణామంగా మారింది. ఇప్పటికే అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ సమయంలో కూడా అతడు అనారోగ్యంగానే బరిలోకి దిగాడు. అయితే ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటై నిరాశపరిచాడు.
ప్రస్తుతం అభిషేక్ ఆరోగ్య పరిస్థితి కొంత తీవ్రంగా ఉండటంతో నమీబియాతో మ్యాచ్‌కు అతడు డౌటేనని సమాచారం. మ్యాచ్ సమయానికి కోలుకోకపోతే అతని స్థానంలో సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి 15న దాయాది జట్టుతో జరగనున్న కీలక మ్యాచ్ నాటికి అభి పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉండగా భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ కూడా అభిషేక్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. నమీబియాతో మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కడుపు నొప్పి కారణంగానే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు అభిషేక్ హాజరుకాలేదని తెలిపారు. మరో రెండు రోజుల్లో అతడు కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పారు.
ఈ ధనాధన్ బ్యాటర్ త్వరగా కోలుకుని మళ్లీ జట్టుకు తోడ్పడాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
