ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్? – జొమాటో, స్విగ్గీకి కొత్త సవాల్
ఆన్లైన్ షాపింగ్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ సంస్థ ఇప్పటికే ‘మినిట్స్’ క్విక్ కామర్స్ ద్వారా కిరాణా సామాగ్రిని నిమిషాల్లో డెలివరీ చేస్తూ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు అదే వేగంతో ఆహార డెలివరీ రంగంలో కూడా ప్రవేశించాలనే ప్రణాళికలు రచిస్తోంది.
సమాచారం ప్రకారం, మే లేదా జూన్ నెలలో బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ సుమారు 9 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2030 నాటికి అది 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ రంగంలో జొమాటో, స్విగ్గీలు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలా? లేక ప్రభుత్వ మద్దతు ఉన్న ONDC నెట్వర్క్ ద్వారా సేవలు అందించాలా? అనే అంశంపై సంస్థలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా దాని ఐపీఓ ప్రణాళిక నిలుస్తోంది. పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లే ముందు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న సంస్థకు ఫుడ్ డెలివరీ ఒక పెద్ద అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 800కు పైగా డార్క్ స్టోర్లు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ ఉండటం సంస్థకు అదనపు బలంగా మారుతోంది. వేగవంతమైన డెలివరీలో ఈ మౌలిక వసతులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
అయితే ఈ రంగంలో నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. గతంలో ఉబెర్ ఈట్స్, అమెజాన్, ఓలా వంటి దిగ్గజాలు భారీ నష్టాలతో వెనుదిరిగిన ఉదాహరణలు ఉన్నాయి. మరోవైపు రాపిడో కూడా ‘ఓన్లీ’ పేరుతో ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశిస్తోంది. జొమాటో, స్విగ్గీలు ఇప్పటికే 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ తమ స్థానాన్ని బలపరుచుకున్నాయి.
ఈ నేపథ్యంలో, భారీ పెట్టుబడులు, విస్తృతమైన కస్టమర్ బేస్, సాంకేతిక సామర్థ్యంతో ఫ్లిప్‌కార్ట్ ఎంతవరకు విజయవంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సంస్థ విజయాన్ని అందుకుంటే, వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లు, తక్కువ ధరలు, వేగవంతమైన సేవలు లభించే అవకాశముంది.
ఫుడ్ డెలివరీ రంగంలో మరో పెద్ద పోటీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
