ఖర్గేకు సీఎం రేవంత్ రిపోర్ట్‌ఢిల్లీలో అరగంట భేటీ – మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీపై ధీమా
న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోబోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తూ పార్టీకి మద్దతు ఇస్తున్నారని వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అనంతరం శంషాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్‌లోని అధికారిక నివాసానికి చేరుకుని, సాయంత్రం రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌రెడ్డి, అనిల్ కుమార్ ఉన్నారు.
దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం.
అనంతరం ఖర్గేతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ధోరణి, సాధించే సీట్లపై చర్చించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు, తదనంతర పరిణామాలపై కూడా ఖర్గేకు వివరించినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై సూచనలు స్వీకరించినట్టు తెలిసింది.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ లేదా శాఖల మార్పుల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పనితీరును ఖర్గే అభినందించినట్టు తెలిసింది. ఎన్నికల కోసం కాకుండా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని సీఎం, మంత్రులను మెచ్చుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా కుల వివక్ష నిర్మూలన లక్ష్యంగా ప్రతిపాదించిన “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” ఆలోచనను ప్రశంసించినట్టు తెలిసింది.
నేడు రాహుల్, కేంద్ర మంత్రులతో భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రాభివృద్ధి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌తో పాటు విద్యా సంస్థల అభివృద్ధికి ఆర్థిక సాయం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయింపు, విభజన చట్ట హామీల అమలుపై కేంద్రాన్ని మరోసారి కోరనున్నట్టు తెలిసింది.
ఏపీ-తెలంగాణ జల వివాదాల పరిష్కారం అంశంపై కూడా సీఎం దృష్టి సారించనున్నట్టు సమాచారం. పోలవరం–నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయనున్నట్టు తెలిసింది.
ఇందుకోసం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, జేపీ నడ్డా, సీఆర్ పాటిల్, ప్రహ్లాద్ జోషిల అపాయింట్‌మెంట్ కోరినట్టు సమాచారం. అలాగే పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మద్దతు తెలపడానికి ఆయనను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
