ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ చైన్‌లో నాసిరకం నూనెల వాడకం… జైపూర్‌లో మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు
పేరుకు ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్… కానీ నాణ్యతలో మాత్రం తీవ్ర లోపాలు బయటపడ్డాయి. McDonald’s అవుట్‌లెట్‌లో నాసిరకం వంట నూనెలు, కుళ్లిన కూరగాయాలు వాడుతున్నట్టు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో వెల్లడైంది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని Jaipurలో చోటుచేసుకుంది.
తనిఖీల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు
ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన అకస్మాత్తు దాడుల్లో కుళ్లిన కూరగాయాలు, పదే పదే మరిగించిన నూనెలను వాడుతున్నట్టు గుర్తించారు. 150 డిగ్రీల సెల్సియస్‌కు పైగా వేడిచేసిన నూనెను రోజంతా ఉపయోగిస్తున్నారని, ఆ నూనె పూర్తిగా నల్లగా మారిపోయినట్టు అధికారులు వెల్లడించారు.
దాదాపు 40 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. వెంటనే కొత్త స్టాక్‌ను వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు.
టీపీసీ స్థాయిలు నిబంధనలకు మించి
మాంసాహార వంటకాలలో వాడిన నూనెల్లో టోటల్ పోలార్ కంపౌండ్ (TPC) స్థాయి 28 శాతం ఉండగా, శాఖాహార వంటకాలలో 31 శాతం నమోదైంది. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం టీపీసీ స్థాయి 25 శాతం మించకూడదు. ఈ పరిమితి దాటితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
ప్రజల్లో ఆందోళన
మెక్‌డొనాల్డ్స్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ అవుట్‌లెట్‌లోనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
అధికారుల తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.
