తెలంగాణలో మున్సిపల్ నంబర్ గేమ్ క్లైమాక్స్‌కు చేరింది: హంగ్ స్థానాల్లో ఉత్కంఠ, భారీ పోలీస్ బందోబస్తు
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ ఎన్నికల సందర్భంగా రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో సోమవారం జరగనున్న పరోక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించనుంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్న స్థానాల్లో సులభ విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. హంగ్ స్థానాలను సైతం కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు బాధ్యతలు అప్పగించి స్వయంగా రంగంలోకి దిగారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ తమకు బలం ఉన్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు విప్ జారీ చేయడానికి సిద్ధమయ్యాయి.
జనగామలో సమాన బలం – ఇండిపెండెంట్లే కీలకం
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమాన బలం ఉండటంతో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇరు పార్టీలు ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ పోటీ కోసం బీ-ఫారంలను ఎన్నికల అధికారులకు అందించాయి. పట్టణంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలియాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత
అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. తుర్కపల్లి వార్డు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
కామారెడ్డిలో రాజకీయ ఒప్పందం
కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మహిళా కౌన్సిలర్ ఇప్ప ఉషారాణికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్కు కేటాయించారు. అఫీజ్ బేగ్‌ను వైస్ చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. రెండు కో-ఆప్షన్ మెంబర్ స్థానాలను కూడా బీఆర్ఎస్కు ఇచ్చారు. పరస్పర అంగీకారంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది.
ఇబ్రహీంపట్నంలో హైడ్రామా
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 3వ వార్డు ఇండిపెండెంట్ విజేత దాసరి మురళీకృష్ణ అదృశ్యమయ్యారని కుటుంబసభ్యులు కిడ్నాప్ ఫిర్యాదు చేశారు. 19వ వార్డు బీఆర్ఎస్ విజేత ఆకుల యాదగిరి కనిపించడం లేదంటూ కూడా ఫిర్యాదు నమోదైంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
తొర్రూరులో ఎక్స్ అఫిషియో ఓటుపై వివాదం
తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటు హక్కుపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మొత్తం 16 వార్డులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 18 ఓట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 10. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ మారతారనే ప్రచారం మధ్య పోలీసులు భారీగా మోహరించారు.
జగిత్యాలలో సీల్డ్ కవర్ ట్విస్ట్
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి పేరు ఖరారైంది. సీల్డ్ కవర్లో పేరు మున్సిపల్ కార్యాలయానికి చేరింది.
హుజురాబాద్, నల్గొండ, సూర్యాపేటలో క్లారిటీ
హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా రోంటాల సుహాసిని ఎన్నికయ్యారు.
హాలియా మున్సిపాలిటీలో చైర్మన్‌గా చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్‌గా రాజా రమేష్ యాదవ్ ఎన్నికయ్యారు.
నందికొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బడుగు మానస స్వర్ణ సుమన్ ఎన్నికయ్యారు.
కోదాడ మున్సిపాలిటీలో పదవుల పంపకం ఫార్ములా ప్రకారం – మొదటి రెండేళ్లు ఎర్నేని కుసుమ చైర్మన్, దేవరపల్లి మల్లీశ్వరి వైస్ చైర్మన్; మిగిలిన మూడు సంవత్సరాలు పారా సత్యవతి చైర్మన్, గుండపనేని పద్మావతి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
మొత్తంగా తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో నంబర్ గేమ్ తుది దశకు చేరింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉన్నా, హంగ్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం జరిగే చైర్పర్సన్, మేయర్ ఎన్నికలు రాజకీయంగా కీలక మలుపు తిప్పనున్నాయి.
