కిశోర బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా – సర్వైకల్ క్యాన్సర్ నివారణకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్:
సర్వైకల్ క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న కిశోర బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి పైగా బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నారు.
బయట మార్కెట్‌లో వేల రూపాయలు పలికే ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలు ఖరారు చేయగా, టీకాలు పంపిణీ చేసే సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు.
మైక్రో ప్లానింగ్‌తో గుర్తింపు
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14–15 ఏండ్ల మధ్య వయసున్న బాలికలు సుమారు 4.60 లక్షల మంది ఉన్నారు. అయితే విద్యాశాఖ లెక్కల ప్రకారం ఈ సంఖ్య సుమారు 3.50 లక్షలు. ఈ నేపథ్యంలో మైక్రో ప్లానింగ్ సర్వే నిర్వహించి స్కూళ్లలో, స్కూల్ బయట ఉన్న అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు ఇవ్వనున్నారు.
యుక్తవయసులోకి వచ్చిన కొత్తలో, అంటే పెళ్లికి ముందు మరియు లైంగిక జీవితం ప్రారంభం కాకముందే టీకా ఇస్తే 100 శాతం రక్షణ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వయసులో రోగనిరోధక శక్తి బలంగా ఉండటంతో టీకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
గర్భిణులు, గతంలో అలర్జీలు ఉన్నవారు, ఇప్పటికే ప్రైవేట్‌లో టీకా తీసుకున్న వారికి మినహాయింపు ఇవ్వనున్నారు.
ఏటా 4 వేల కేసులు
కేంద్ర అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 4 వేల మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తుగా టీకా తీసుకోవడమే సమర్థవంతమైన నివారణ మార్గమని చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.2,000 నుంచి రూ.4,000 వరకు ఉంది. పూర్తి కోర్సు చేయించుకోవాలంటే మరింత ఖర్చవుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది భారమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించింది.
వైరస్ వల్లే క్యాన్సర్
సర్వైకల్ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదని, ఇది Human papillomavirus infection (హెచ్‌పీవీ) వల్ల వస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, ఎక్కువ ప్రసవాలు వంటి కారణాలు ప్రమాదాన్ని పెంచుతాయి. లైంగిక సంబంధాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
వైరస్ సోకిన వెంటనే క్యాన్సర్ రాదు. సాధారణంగా 10 నుంచి 15 ఏండ్ల తర్వాత వ్యాధి బయటపడుతుంది. అందుకే ముందుగానే టీకా తీసుకుంటే వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు.
30 ఏండ్లు దాటిన మహిళలు ఐదేండ్లకోసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
