క్యాతనపల్లి ఘటనపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మీడియా సమావేశం
క్యాతనపల్లి ఘటనపై కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యవహారం పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమన్ తన అనుచరులతో కలిసి తమపై దాడి చేసి మంత్రి, ఎంపీ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారని మంత్రి తెలిపారు.
“ఇది ఏ విధమైన రాజకీయ సంస్కృతి? ఇలాంటి చర్యలను హరీష్ రావు సమర్థిస్తారా?” అని ప్రశ్నించారు.
క్యాతనపల్లిలో ఎలాంటి సమస్యలు లేవని, సుమన్ దౌర్జన్యాన్ని అందరూ ప్రత్యక్షంగా చూశారని మంత్రి పేర్కొన్నారు.
సుమన్ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలేనని, కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
మొదటి రోజు కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు మంత్రి వివరించారు. రెండో రోజు బయటి వ్యక్తులు వచ్చి అనవసరంగా గొడవ సృష్టించడంతో తిరిగి వాయిదా పడిందన్నారు. ఎన్నికల ప్రక్రియను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.
రాళ్లు విసిరి దాడులు చేయడం ద్వారా పరిస్థితిని ఉద్రిక్తం చేశారని, గత రెండు రోజులుగా సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
గతంలో చెన్నూరు, క్యాతనపల్లిలో ఎన్నికలు సక్రమంగా జరగలేదని, గుండా రాజకీయాలతో ఏకగ్రీవాలు సాధించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. “వాళ్లు క్యాంపులు పెట్టుకున్నప్పుడు మేమెప్పుడైనా గొడవ చేశామా? మేమెక్కడ అధికార దుర్వినియోగం చేశాం?” అని ప్రశ్నించారు.
మంత్రి, ఎంపీ వాహనాలపై రాళ్లు విసరడం సరైనదా అని ప్రశ్నించిన మంత్రి, తమపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అధికారంలో లేనప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, ఓటమిని జీర్ణించుకోలేక సుమన్ అసహనాన్ని చూపిస్తున్నారని అన్నారు.
హరీష్ రావుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే సుమన్ చేసిన దాడిని ఖండించాలని మంత్రి డిమాండ్ చేశారు. చెన్నూరులో తాము ఎప్పుడూ బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయలేదని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.
