Canadaలో అక్రమ వలసలపై కఠిన చర్యలు
18,785 మంది విదేశీయులు వెనక్కి.. 2,800 మంది భారతీయులు
ఇంటర్నెట్ డెస్క్: అక్రమ వలసలను తీవ్రంగా పరిగణిస్తున్న Canada గతేడాది భారీ సంఖ్యలో విదేశీయులను దేశం నుంచి వెనక్కి పంపించింది. జాతీయ భద్రతకు ముప్పు, మానవ హక్కుల ఉల్లంఘన, వ్యవస్థీకృత నేరాలు, శరణార్థి నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Canada Border Services Agency (CBSA) తెలిపిన వివరాల ప్రకారం, గతేడాది తొలి పది నెలల్లోనే మొత్తం 18,785 మంది విదేశీయులను కెనడా నుంచి పంపించారు. ప్రస్తుతం మరో 29,542 మందిని దేశం నుంచి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది.
తిప్పిపంపిన వారిలో 3,972 మంది మెక్సికన్లు, సుమారు 2,800 మంది భారతీయులు ఉన్నారు. తదుపరి జాబితాలో మరో 6,000కు పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం.
కఠిన చర్యలు
సరైన పత్రాలు లేకపోవడం, వీసా నిబంధనల ఉల్లంఘన, క్రిమినల్ కేసులు వంటి అంశాలపై కెనడా కఠినంగా వ్యవహరిస్తోంది. చట్టాలను అతిక్రమించిన విదేశీయులపై తీవ్రతను బట్టి మూడు రకాల ఆర్డర్లు జారీ చేస్తారు:
- డిపార్చర్ ఆర్డర్ – స్వల్ప తీవ్రత గల కేసులు; 30 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలి
- ఎక్స్‌క్లూజన్ ఆర్డర్ – ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు తిరిగి ప్రవేశానికి నిషేధం
- డిపోర్టేషన్ ఆర్డర్ – దేశంలోకి శాశ్వత నిషేధం
డిపార్చర్ ఆర్డర్ అందుకున్న వారు నిర్ణీత గడువులో దేశం విడిచిపెట్టకపోతే, డిపోర్టేషన్ ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉంటుంది.
అక్రమ వలసలను నియంత్రించేందుకు కెనడా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
