భారత్–అమెరికా సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీకి గూగుల్ ముందడుగు
ఏఐ అనుసంధానత పెంపుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి
ఇంటర్నెట్ డెస్క్: భారత్–అమెరికా మధ్య సబ్‌సీ (సముద్రగర్భ) కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు Sundar Pichai ప్రకటించారు. భారత్‌లో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య ఏఐ అనుసంధానతను పెంచేందుకు కొత్త సబ్‌సీ కేబుల్ రూట్లు వేయనున్నట్లు తెలిపారు.
Google భారత్–అమెరికాతో పాటు దక్షిణార్ధగోళంలోని పలు ప్రాంతాలను ఈ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించనున్నట్లు వెల్లడించింది.
“ఏఐ అనేది అతిపెద్ద మార్పు. వైద్య రంగంలో పరీక్షలు, చికిత్సలు, రైతులకు రియల్ టైమ్ హెచ్చరికలు వంటి అనేక రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఎన్నో సవాళ్లను పరిష్కరించగలదు” అని పిచాయ్ పేర్కొన్నారు. భారతదేశ ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో గూగుల్ భాగస్వామ్యం కానుందని తెలిపారు. దేశంలోని భాషా వైవిధ్యం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్‌కు బలమైన పునాది అని ఆయన వ్యాఖ్యానించారు.
అదే సందర్భంలో గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఏమిటీ సబ్‌సీ కనెక్టివిటీ?
సబ్‌సీ కేబుల్ అంటే సముద్రగర్భంలో వేసే ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లు. వీటి ద్వారా దేశాల మధ్య హైస్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. భారత్–అమెరికా కనెక్టివిటీ భాగంగా కొత్త సబ్‌సీ కేబుల్ రూట్లు, ఫైబర్-ఆప్టిక్ మార్గాలు, అంతర్జాతీయ ల్యాండింగ్ స్టేషన్లు అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం రాబోయే ఐదేళ్లలో భారత్‌లో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల భారత్–అమెరికాతో పాటు ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు కూడా మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.
కీలక అంశాలు:
- భారత్ నుంచి సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు మూడు సబ్‌సీ రూట్లు
- అమెరికా–భారత్ మధ్య నాలుగు వ్యూహాత్మక ఫైబర్-ఆప్టిక్ రూట్లు
- ముంబయి, చెన్నై ల్యాండింగ్ పాయింట్లపై ఆధారాన్ని తగ్గింపు
- విశాఖపట్నంలో కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే ఏర్పాటు
ఈ ప్రాజెక్ట్‌తో డేటా ట్రాన్స్‌ఫర్ వేగం పెరగడంతో పాటు నెట్‌వర్క్ అంతరాయాలు తగ్గుతాయి. భారత డిజిటల్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
