తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఈ సారి ప్రత్యేక క్యూఆర్ కోడ్!
Telangana Inter Hall Tickets) రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల (మార్చి 2026) హాల్ టికెట్లను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) గురువారం విడుదల చేసింది.
ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు బోర్డు పేర్కొంది.
కళాశాలల్లోనే హాల్ టికెట్ల పంపిణీ..
ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా కళాశాలల ఆన్లైన్ లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి హాల్ టికెట్లను తీసుకోవాలని సూచించింది. హాల్ టికెట్లలో విద్యార్థుల వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా బోర్డు దృష్టికి తీసుకువచ్చి సరిచేసుకోవాలని అధికారులు కోరారు.
పరీక్షా కేంద్రాల గుర్తింపునకు క్యూఆర్ (QR) కోడ్
విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని సులభంగా వెతుక్కునేందుకు వీలుగా ఈ సారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా ‘క్యూఆర్ (QR) కోడ్’ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా సెంటర్ ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకోవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం మొబైల్ ద్వారా కూడా హాల్ టికెట్లను పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులు బోర్డు వద్ద నమోదు చేసుకున్న (రిజిస్టర్డ్) మొబైల్ నంబర్లకు నేరుగా ఎస్ఎంఎస్ (SMS) ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్‌ను పంపనున్నట్లు టీజీబీఐఈ (TGBIE) వెల్లడించింది.
