పెద్దపల్లి జిల్లాలో దారుణం: భార్యను రాయితో కొట్టి చంపేశాననుకున్న భర్త — 24 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ పద్మ
పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేయాలని ప్రయత్నించిన భర్త ఘాతుకం జిల్లాలో కలకలం రేపింది. వివరాల ప్రకారం, మంచిర్యాలకు చెందిన నూనె పద్మను ఆమె భర్త నూనె వెంకటేష్ జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకువెళ్లి బండరాయితో తలపై దారుణంగా దాడి చేశాడు. ఆమె చనిపోయిందని భావించి చెట్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.
పద్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు భర్త వెంకటేష్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనుమానితుడిగా వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, జాఫర్ ఖాన్ పేట గుట్ట వద్దకు తీసుకెళ్లి రాయితో కొట్టి పడేశానని ఒప్పుకున్నాడు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం కోసం వెతకగా షాకింగ్ దృశ్యం కనిపించింది. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పద్మను చూసి వారు విస్తుపోయారు. 24 గంటలకు పైగా ముళ్ల పొదల్లో అచేతనంగా పడివున్న ఆమెను వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఆసుపత్రికి మార్చారు. పోలీసుల తక్షణ చర్యల వల్ల పద్మ ప్రాణాలు దక్కినట్లు వైద్యులు తెలిపారు.
మంచిర్యాలకు చెందిన పద్మను వెంకటేష్ 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే గత ఏడేళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూ కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఇదే సమయంలో వెంకటేష్ రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం కోర్టు విచారణకు ఇద్దరూ హాజరై తిరిగి వస్తూ మాట్లాడుకుందామని చెప్పి పద్మను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ప్రస్తుతం నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
