శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో హుండీ ఆదాయం వెల్లువ — 13 రోజుల్లో రూ.5.61 కోట్లు
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో భక్తులు అపార భక్తిని చాటుకున్నారు. ఇటీవల వైభవంగా నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు సమర్పించిన కానుకల లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. గత 13 రోజుల్లో మల్లన్నకు భారీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
చంద్రవతి కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.5,61,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు.
నగదుతో పాటు భక్తులు మొక్కుల రూపంలో బంగారం, వెండి ఆభరణాలను పెద్ద ఎత్తున సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు కానుకగా 124.5 గ్రాముల బంగారం, 5.550 కిలోల వెండి లభించాయి.
భారతీయ కరెన్సీతో పాటు విదేశాల్లో నివసిస్తున్న భక్తులు కూడా తమ భక్తిని చాటుకున్నారు. హుండీలో 22 అమెరికా డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, సింగపూర్ డాలర్లు, యూరో కరెన్సీ కూడా లభించినట్లు అధికారులు తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తుల రద్దీతో దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.
