తెలంగాణలో జనసేన బలోపేతానికి ‘ఉద్యమి’ డ్రైవ్ — కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు Jana Sena Party తెలంగాణ విభాగం ప్రకటించింది.
‘ఉద్యమి’ పేరుతో ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా మరింత బలపరిచేందుకు జిల్లాల వారీగా నాయకులకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజాగా ఏర్పడిన మూడు కార్పొరేషన్లకు వేర్వేరు ఇన్ఛార్జులను నియమించారు.
రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, అలాగే పార్టీ నాయకులు రాధారాం రాజలింగం, కావ్య మండపాక, శిరీష పొన్నూరి పర్యవేక్షించనున్నారు.
అదేవిధంగా, ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను సంబంధిత నాయకులకు అప్పగించినట్లు పార్టీ ప్రకటించింది.
ఈ ‘ఉద్యమి’ సభ్యత్వ డ్రైవ్ ద్వారా తెలంగాణలో పార్టీ బలం పెంచడంతో పాటు భవిష్యత్ ఎన్నికలకు బలమైన సంస్థాగత వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది.
